తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి(66) ఇక లేరు అన్నవార్తతో టాలీవుడ్ మూగబోయింది. ఈనెల 24 న న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.ప్రముఖుల స్పందన...
ప్రధాని నరేంద్ర మోడీ:
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి .
ఏపీ సీఎం జగన్:
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
చంద్రబాబు నాయుడు:
ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్ర్బాంతిని కలిగించింది. ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటు. అంచలంచలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
లోకేష్:
ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చలనచిత్రపరిశ్రమ,సాహిత్య లోకానికి తీరనిలోటు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు ..ఆణిముత్యాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అశ్రునివాళి అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
మెగాస్టార్ చిరంజీవి:
నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
మిత్రమా ... will miss you FOREVER !
నందమూరి బాలకృష్ణ
తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా భాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంభ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
జూనియర్ ఎన్టీఆర్:
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.
మోహన్ బాబు:
సిరి వెన్నెల సీతారామశాస్త్రి... నాకు అత్యంత సన్నిహితుడు…సరస్వతీ పుత్రుడు... విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది... ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
దర్శకుడు వేగేశ్న సతీష్:
కాలం విసిరిన
కరవాలానికి
కలం మూగబోయింది.
సిరివెన్నెలని దూరం చేసి
మాకు కటిక చీకటిని మిగిల్చింది.
పదాలు మూగబోయాయి
అక్షరాలు నివ్వెరపోయాయి.
నోటిమాట రాక
కంట నీరు ఆగక
మేము నిర్జీవులం అయిపోయాం.
హీరో నాని:
His words, his songs and his magic will live forever.
ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది.
వీడుకోలు గురువు గారూ..
హరీష్ శంకర్:
ఇంకెక్కడి వెన్నెల
తెలుగు పాటకు అమావాస్య
గోపీచంద్ మలినేని:
కను మూసిన తరువాతనే.. పెను చీకటి చెబుతుందా !!!
తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటు ఇది!
ఎప్పుడూ.. ఎల్లప్పుడూ.. ❤️
మీరు, మీ పాటలు మాతోనే జీవిస్తుంటాయి!
అనిల్ రావిపూడి:
తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... 🙏
అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, 😭🙏