కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచే నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఆయన గురించిన వార్తలు, జ్ఞాపకాలు రోజూ చూస్తూనే ఉన్నాము. ఆయన అభిమానులు ఇప్పటికి పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శిస్తూనే ఉన్నారు. అలాగే సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని కలిసి ఓదారుస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆయన అన్న శివ రాజ్ కుమార్ బాగా కృంగిపోయారు. పునీత్ అంత్యక్రియలు రోజున అందరూ శివ రాజ్ కుమార్ పరిస్థితిని చూసారు. చిన్న పిల్లాడిలా ఆయన ఏకధాటిగా తమ్ముడి భౌతిక కాయం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివ మాటలు వింటే అందరి గుండె భారంతో నిండిపోతుంది.
శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని, అప్పు ఎప్పుడూ నా పక్కనే ఉండి.. శివన్నా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, పునీత్ మరణం తర్వాత రోజులు ఎలా గడిచిపోతున్నాయో అర్ధం కావడం లేదు అని, ఈ బాధనుండి బయట పడాలని.. వర్క్ మీద దృష్టి పెట్టినప్పటికీ.. ఎక్కడికి వెళ్లినా పునీత్ ఫొటోస్ కనిపించడంతో.. వాటిని చూసి కన్నీళ్ళు ఆగడం లేదు అని, అందుకే పునీత్ ఫొటోస్ చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా అని, కానీ తర్వాత తేరుకుని.. ఈ భూమి మీద జన్మించిన ప్రతివారు ఎప్పుడో ఒకసారి ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే కదా అని గుండె దైర్యం తెచ్చుకుంటున్నా అని చెప్పిన శివ రాజ్ కుమార్.. పునీత్ భార్య అశ్విని, పిల్లలకు తనకి చేతనైనంత సహాయం చేస్తాను, చేస్తూనే ఉంటాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం అందరి మనసులని కలిచివేసింది.