టాలీవుడ్ దర్శకులు వరల్డ్ వైడ్ గా సత్తా చాటటడమే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని అందనంత ఎత్తులో నిలుపుతున్నారు. టాప్ దర్శకుడు రాజమౌళి బాహుబలి తో తెలుసు సినిమాని ఎవరూ అందుకోలేంత ఎత్తులో నించోబెట్టడమే కాదు.. ప్రపంచమే తెలుగు ఇండస్ట్రీవైపు చూసేలా చేసారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ అంటూ వరల్డ్ వైడ్ గా అందరి చూపు తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఉండేలా చేస్తున్నారు. ఒక్క రాజమౌళినే కాదు.. బాలీవుడ్ లోనూ తెలుగు దర్శకులు తామేమిటో నిరూపించుకోవడమే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రలో తెలుగు ఇండస్ట్రీని నెంబర్ వన్ గా ఉంచాలనే తాపత్రయంతో ఉన్నారు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఏపీ సీఎం జగన్ చిన్న చూపు తగునా..
ఇప్పుడు ఇదే సినిమా వాళ్లలో మెదులుతున్న ప్రశ్న. సినిమా వాళ్ళే కాదు.. ప్రతి తెలుగు వాడు అడిగే, అడుగుతున్న ప్రశ్న. సినిమా టికెట్ రేట్స్ విషయం.. రోజుకు నాలుగు ఆటల నిబంధన కూడా పెద్ద సినిమాల విషయంలో కక్ష గట్టినట్టే కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాని ఉన్నత శిఖరాన నిలుపుతున్న దర్శకనిర్మాతలకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడడం లేదు. అసెంబ్లీలో టికెట్ రేట్స్, ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలని, అలాగే రోజుకు ఆరు, ఏడు, ఎనిమిది షోస్ లేకుండా.. కేవలం నాలుగు షోస్ కే పరిమితం చెయ్యడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం. పరిమితంగా టిక్కెట్ రేట్లు ఇవన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. పెద్ద సినిమాలకు ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉంటాయి. భారీ బడ్జెట్ సినిమాలకు రెండుమూడు రోజుల వరకు టికెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే నాలుగు నుండి ఎనిమిది షోస్ కూడా అలాంటి సినిమాలకి ఆవరసం. కానీ ఏపీ ప్రభుత్వ తీసుకొచ్చిన చట్టం వలన ఇప్పుడు అవన్నీ ఆగిపోతాయి. మరి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు గాలికి కొట్టుకుపోయినట్లే.. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకధాటిగా వచ్చి పోరాటం చేస్తే ఎమన్నా ప్రభుత్వం దిగివస్తుందేమో చూడాలి.