ఏపీ గవెర్నెమెంట్ సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంది అని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని లు పవన్ పై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌పై ద్వేషంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలపై ఇండస్ట్రీ పెద్దల వినతిని ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తే ఇప్పుడు ప్రభుత్వంపై విషం చిమ్మడమేంటని పేర్ని నాని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని నాని అన్నారు. తెలంగాణలో 519 థియేటర్లుకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడస్తున్నాయి. ఏపీలో 3రోజులుగా 510 థియేటర్లలో లవ్ స్టోరీ సినిమా ఆడుతోంది. ఈ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మే ప్రయత్నమని లవ్‌స్టోరి చిత్ర నిర్మాత నారంగ్ చెప్పాలి.. అంటూ పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మరో మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ.. సినిమా టికెట్ల అంశంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు సరికాదు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌లైన్ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల ఆన్‌లైన్ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు. నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా?ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అసలు సినిమా ఇండస్ట్రీలో పవన్ మాత్రమే హీరో కాదు.. ఇంకా చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం, మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి.. అంటూ పవన్ పై బొత్స ఫైర్ అయ్యారు.
మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని అనేంత దమ్ము లేదు.. పవన్ కి ఇండస్ట్రీపై అంత ప్రేమే ఉంటె.. ఆయనే జగన్ గారితో మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవాలని అన్నారు.