హీరో సిద్దార్థ్ సినిమాలకు భారీ గ్యాప్ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటాడు. ఈమధ్యన సిద్దార్థ్ కి బిజెపి వాళ్లకి అస్సలు పడడం లేదు. బిజెపి నేతల మధ్యన - సిద్దార్థ్ కి మధ్యన మాటల యుద్ధం జరుగుతుంది. తమిళంలో సినిమాలతో కొద్దిగా బిజీ అవుతున్న తరుణంలో అజయ్ భూపతి సిద్దార్థ్ కి చెప్పిన మహాసముద్రం మూవీ కథ నచ్చి శర్వానంద్ తో కలిసి ఆ సినిమా చేసాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వా - సిద్దు కలిసి మహాసముద్రం చేసారు. తాజాగా మహాసముద్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఓ రేంజ్ లో చేసారు. అక్టోబర్ 14 న మహాసముద్రం మూవీ రిలీజ్ ఉండడంతో ప్రమోషన్స్ ని గట్టిగా మొదలు పెట్టింది టీం.
అయితే శర్వానంద్, అను ఇమ్మాన్యువల్ మిగతా మహా సముద్రం టీం మొత్తం మహాసముద్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు. కాని మరో హీరో సిద్దార్థ్ ఎక్కడా కనిపించలేదు. దానితో మీడియాలో పుకార్లు, ప్రేక్షకుల్లో అనుమానాలు తలెత్తెడంతో.. అజయ్ భూపతి సిద్దు రాకపోవడానికి కారణం వివరించాడు. సిద్ధార్త్ ఆపరేషన్ కోసం లండన్ వెళ్లాడు అని.. అందుకే మహాసముద్రం ఈవెంట్‌కు ఆయన హాజరుకాలేకపోయాడు.. అని చెప్పాడు. కానీ ఆ ఆపరేషన్ ఏమిటి, ఎందుకు అనేది మాత్రం చెప్పలేదు. మరి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సిద్దు ఈ ఆపరేషన్ విషయాన్ని ఎందుకు షేర్ చెయ్యలేదబ్బా అంటూ ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.