2019 లో కరోనాకి పుట్టినిల్లుగా మారిన చైనాలో అప్పట్లో వూహాన్ సిటీలో కరోనా కారణంగా శవాల గుట్టలు ప్రపంచాన్నే గడగడలాడించాయి. చైనా లో పుట్టిన కరోనా ఇప్పటికి ప్రపంచాన్నే ఒణికించేస్తుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. కరోనా కట్టడి చెయ్యలేకపోతున్నాయి పలు దేశాలు. తర్వాత చైనా లో కరోనా అదుపులోకి వచ్చేసింది. జనజీవనం సాధారణ పరిస్థికి వచ్చేసింది. కానీ ఇంకా కొన్ని దేశాలు కరోనా కారణంగా లాక్ డౌన్ లు పెట్టుకుని గప్ చుప్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో చైనా లోని చాలా ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లు విధించింది. చైనా పట్టణాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఆదేశాలిచ్చింది.
మరోపక్క చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఫుజియాన్ ప్రావిన్స్ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు.