ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో ఈ రోజు ఉదయమే కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు.
ఉత్తేజ్ కొన్నేళ్ల క్రితమే మొదలు పెట్టిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన ఇద్దరు కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్, జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఉత్తేజ్ భార్య పద్మావతి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.