ఇండియా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 40 వేలకు పైబడే కేసులు నమోదు కాగా.. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు చేరడం కాస్త ఊరటనిస్తోంది. అయితే కరోనా మరణాలు మాత్రం 300కుపైనే నమోదయ్యాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాస్త కరోనా అదుపులోనే ఉన్నా.. కేరళలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం కేరళ నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో కొత్తగా 20,487 కేసులు నమోదు కాగా 181 మరణాలు చోటుచేసుకున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,30,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 28,591 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రికవరీ రేటు 97.51%గా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతుంది.