బిగ్ బాస్ సీజన్ 5 గత ఆదివారమే మొదలయ్యింది. నాగార్జున హోస్ట్ గా 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతుంది. బిగ్ బాస్ సీజన్ 5 మొదటి నుండి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ అంతా.. గేమ్ ప్లాన్ తోనే హౌస్ లో తిరుగుతున్నారు. పక్కా గా గేమ్ ని ఒంటబట్టించుకుని హౌస్ లోకి ఎంటర్ అయ్యారనిపిస్తుంది. ఎలా అయితే స్క్రీన్ స్పేస్ వస్తుందో. దానికి అనుగుణంగా ఏడవడం, గొడవలు పడడం చేస్తున్నారు. అయితే ఎలాగో సాఫీగా సాగుతున్న బిగ్ బాస్ పై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిగ్ బాస్ అనేది సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఉందని.. వెంటనే దీనిని నిలిపివెయ్యడమే కాదు, నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి షోలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. బిగ్ బాస్ వలన ఉపయోగం ఎవరికో చెప్పాలన్నారు. బిగ్‌బాస్ షో అంటేనే బూతుల ప్రపంచమని, దీనిని వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు పనీపాటా లేని ఇలాంటి షోకు అనుమతి నివ్వడం చాలా ఘోరమైన విషయమన్నారు నారాయణ. ఈ షో అనైతికమన్నారు. దీనిని ఆపాలంటూ తాను కోర్టుల్లో కేసులు వేసినా న్యాయవ్యవస్థ కానీ, పోలీసులు కానీ తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి దారుణ షోలకు అనుమతినివ్వడం మానుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.