సోమవారం వరకు సినిమా షూటింగ్స్, సినిమాల నిర్మాతలతో భేటీ లతో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయమే రాజకీయాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో బీజేపీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంతేకాకుండా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కుమార్తె వివాహ రిసెప్షన్ లో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ని పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కర్ణాటక రాష్ట్ర మంత్రులు గౌరవపూర్వకంగా కలిసి ముచ్చటించారు.
కేంద్ర మంత్రులు వి.మురళీధరన్, శోభ కరంద్లాజే, భగవంత్ ఖుబా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, పార్లమెంట్ సభ్యులు కె.రఘురామకృష్ణంరాజు పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదెరాబాద్ కి చేరుకున్నారు. రేపటి నుండి ఆయన నటించే సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు.