ఈ మధ్యన తెలుగు దేశం సీనియర్ నేత రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టిడిపికి రాజీనామా చేయబోతున్నారనే న్యూస్ తెలుగు దేశం శ్రేణుల్ని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుని కలిచివేసింది. తర్వాత గోరంట్ల రాజీనామా విషయాన్ని చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి బుజ్జగించారు. ఇక తాజాగా చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులపై ఇటీవల గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి ముఖ్యనేతల సంప్రదింపులతో ఆయన ఇవాళ చంద్రబాబు వద్దకు వచ్చారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు. తెదేపా అధిష్ఠానంపై అలకబూనిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి కారణాలు తెలుసుకునేందుకు ఆ పార్టీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీని నియమించింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కె.ఎస్.జవహర్‌లు ఇటీవల బుచ్చయ్యచౌదరి నివాసానికి వెళ్లి సుమారు రెండున్నర గంటలపాటు గోరంట్లతో అంతర్గతంగా చర్చలు జరిపారు.
గోరంట్ల అభిప్రాయాలు, మనోభావాలు తెలుసుకున్నారు. చర్చల్లో ఆయన వెలిబుచ్చిన విషయాలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఇక గోరఁట్ల చంద్రబాబు తో సుదీర్ఘ సమావేశం తర్వాత మీడియా తో మట్లాడుతూ.. పార్టీలో ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాను అని, పార్టీలో అంతర్గత విభేదాల గురించి చర్చించినట్లుగా చెప్పారు గోరంట్ల.