టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల ఫైనల్లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ రవి కుమార్ దహియాను సినిమా సెలెబ్రిటీస్, క్రీడాభిమానులు, క్రీడా సెలబ్రిటీస్ పొగిడేస్తున్నారు. 57 కేజీల ఫైనల్‌లో రష్యాకు చెందిన ప్రపంచ విజేత అయిన జావుర్ ఉగుయేవ్ చేతిలో ఓటమి పాలైన రవికుమార్ రజతంతో సరిపెట్టుకున్నాడు. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రజత పతకం అందించిన రెండో క్రీడాకారుడిగా రవికుమార్ రికార్డ్ సృష్టించాడు.
ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత రెజ్లర్ రవి కుమార్ దహియాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ఫైనల్‌లో రవి కుమార్ దహియా తన ప్రత్యర్థిపై అత్యుత్తమ పోరాటం చేశారని, ఆయన రజతం సాధించినందుకు దేశం గర్వపడుతోందని, భవిష్యత్తులో రవి మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రముఖ క్రికెటర్ సచిన్ దగ్గర నుండి.. సినిమా సెలబ్రిటీస్ వరకు రవి కుమార్ పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.
మరోపక్క హర్యానా ప్రభుత్వం రవికుమార్ కి నాలుగు కోట్ల రూపాయల క్యాష్ అవార్డ్ ప్రకటించింది. క్లాస్ వన్ కేటగిరిలో ఉద్యోగం.. అదే సమయంలో హర్యానాలో ఎక్కడ కోరుకుంటే అక్కడ 50 శాతం రాయితీతో రవి కుమార్ దహియాకు భూమి ఇవ్వనున్నారు. రవి కుమార్ దహియా సొంత గ్రామం నహ్రీలో హర్యానా ప్రభుత్వం ఇండోర్ స్టేడియం కట్టనుంది.