టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో నిన్న సెమిస్ లో ఓటమి పాలైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నేడు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని చేజిక్కించుకుంది. చైనా తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. పతకం అంచనాల ఒత్తిడి మధ్య బరిలో దిగిన సింధు.. ఎక్కడా తడబాటు లేకుండా బింగ్జియావోను వరుస గేముల్లో మట్టికరిపించింది. తొలి గేమును 21-13తో సొంతం చేసుకున్న తెలుగుతేజం, ఆపై రెండో గేమును 21-15తో సాధించింది.
ఒలింపిక్ క్రీడల్లో సింధుకు ఇది రెండో పతకం. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు రజతం నెగ్గింది. నిన్న జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి భారత త్రివర్ణ పతాకాన్ని టోక్యో ఒలింపిక్స్ లో రెపరెపలాడించింది. కాంస్యం కోసం పోరులో నెగ్గి కోట్లాది భారతీయుల ముఖాల్లో సింధు ఆనందం నింపింది. సింధు సాధించిన పథకంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పథకాల సంఖ్య రెండుకి చేరింది.