గత నెల రోజులో ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండగా తాజాగా కోలుకున్నవారి సంఖ్యే అధికంగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. ఇక ముందు రోజు 41 వేల కేసులుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. తాజాగా 35వేల కేసులు వెలుగు చూడగా మరణాలు కూడా 500లోపే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు సడలించినా కరోనా కేసులు 30 వేలకి దిగిరావడం శుభసూచకమే.
గురువారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.68లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 35,342 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లు దాటింది.
ఇక ఇదే సమయంలో 38,740 మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,04,68,079కు చేరింది. రికవరీ రేటు 97.35శాతంగా ఉంది.
24 గంటల వ్యవధిలో మరో 483 మంది వైరస్‌కు బలయ్యారు. మరణాల రేటు 1.34శాతంగా ఉంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,19,470 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.