పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడిన పవన్ జనేసేన.. ఇప్పుడు రైతు పక్షాన పోరాటానికి సిద్ధమైంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోందని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని పవన్ ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బకాయిల కారణంగా కోనసీమలోని గ్రామాల్లో రైతులు పంట వేయబోమని క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్ గుర్తు చేశారు. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.