కొన్ని రోజులుగా ఆర్.నారాయణమూర్తి పరిస్థితి బావుండలేదని, ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. డబ్బుకి ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రజానాయకుడు గద్దర్ కూడా ఆర్ నారాయణమూర్తి పరిస్థితిపై గళమెత్తారు అని, ప్రభుత్వం ఆర్. నారాయణమూర్తిని ఆదుకొమ్మంటూ వేడుకున్నారంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఖండించారు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి.
ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన చెందారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా.. అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా.. అంటూ తనకెలాంటి ఇబ్బందులు లేవంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.