ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందు కంటే కరోనా కేసులు 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి. నిన్న మరో 624 మంది కరొనకి బలయ్యారు. ఇప్పటివరకు 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 4,29,946 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న 41వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇక కరోనా కేసులు కాస్త తగ్గుతుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని సడలించాయి. థర్డ్ వేవ్ కోసం అన్ని రాష్ట్రాలు సన్నద్ధం అవుతున్నాయి. మరోపక్క మరోసారి కరోనా కేసులు పెరుగుదలతో కేరళ రాష్ట్రం రెండు రోజుల లాక్‌డౌన్ ని అమలు చేస్తుంది.
దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రదే సగానికి పైగా వాటా ఉంది. ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ వైపు మొగ్గుచూపింది. జులై 17, 18న పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే ఉంది.