తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసినా.. ఆంధ్రఓప్రదేశ్ లో మాత్రం ఇంకా కొంత సమయం పాటు కర్ఫ్యూ కొనసాగుతుంది. జులై 7 వరకు ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో ఈ కర్ఫ్యూ ని ఓ 12 గంటల పాటు కొనసాగించింది ఏపీ ప్రభుత్వం, ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం లాంటి జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా ఉండడంతో అక్కడ 12 గంటల కర్ఫ్యూని అమలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా జులై 7 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది.
తాజా నిబంధనల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది.
అదే విధంగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం... శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని హెచ్చరికలు జారీ చేసింది.