ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. కరోనా కట్టడికి కేవలం వ్యాక్సినేషన్ మాత్రమే అడ్డుకట్ట వేస్తుంది అంటూ ప్రజలు పెద్ద మొత్తంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఒకప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోండిరా అంటే పారిపోయిన జనాలు.. ఇప్పుడు అదే వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది వ్యాక్సిన్ పేరుతొ భారీ మోసాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులకి చిరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే యూనియన్లు కూడా తమ సబ్యులకు వ్యాక్సినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
అలాగే ఇంకా కొంతమంది సినీమా ప్రముఖులు కూడా మంచి చేద్దామని.. తమ స్వంత ఖర్చుతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మొదలుపెట్టారు. అయితే ఆ వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్ట్ మెంట్ అంటూ పరిచయమయిన ఓ వ్యక్తి ని నమ్మి అతని అకౌంట్ కి కొంత డబ్బుని పంపించారు. సదరు వ్యక్తి నేను హెల్త్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాను, కేసీఆర్, కేటీఆర్ లతో మాట్లాడి వ్యాక్సిన్ ఇప్పిస్తానని భారీ మోసానికి తెర లేపాడు. ఈ వ్యాక్సినేషన్ కోసం నటుడు అలీ, ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు ఆ వ్యక్తిని నమ్మి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాట్లలో ఉండి.. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్ కి లక్షల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసి.. వ్యాక్సిన్ డోసెస్ కోసం సదరు వ్యక్తికి ఫోన్ చెయ్యగా.. అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా, స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి ఖంగుతిన్నారు.
ఆ ఫోన్ నెంబర్ మరియు మనీ ఫోర్వర్డ్ చేసిన అకౌంట్ రమా దేవి అనే పేరు పై వుండటంతో మోసపోయాము అని గ్రహించారు. మోసపోయిన వారిలో మెగాస్టార్ బ్రదర్, అలీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాత వున్నారు. పోలీస్ కేసు పెట్టేందుకు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.