గత 15 రోజులుగా టీఆరెస్ నేత ఈటెల హై డ్రామా కి ఎట్టకేలకు నేడు తెర పడింది. ఈటెల మీద అభియోగంతో రాత్రికి రాత్రే ఆయన్ని తన మంత్రి పదవి నుండి త్పపించడం తట్టుకోలేని ఈటెల రాజేంద్ర సమయం కోసం ఎదురు చేస్తూ నేడు టీఆరెస్ పార్టీకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. తన వివరణ అడక్కుండా మంత్రి పదవి నుండి తప్పించి తన మీద చర్యలకు రెడీ అయ్యారని, టీఆరెస్ లో ఆత్మగౌరవం లేదని అందుకే టీఆరెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఈటెల ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామా విషయాన్ని తెలియజేసారు. మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో టీఆరెస్ మంత్రులపై, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
హుజురాబాద్ నియోజక వర్గంలో తన పరువు పోయేలా బతికి ఉండగానే నన్ను బొంద పెట్టాలని సీఎం ఆదేశించడంతోనే ఇలా తన మీద అభియోగాలు మోపుతున్నారు. హుజురాబాద్ టీఆరెస్ కార్యకర్తలకు డబ్బు ఆశ చూపించి తన మీద తిరగబడేలా చేస్తున్నారు. ఇన్నిరోజులుగా నాతో కలిసి మెలసి తిరిగిన వారు నాపైనే కుట్రలు పన్నుతున్నారని నాతో ప్రజలు అంటున్నారు. ఐదేళ్ల క్రితమే నాకు అవమానము జరిగింది, తొమ్మిదిమంది ఏమ్మెల్యేలతో కలిసి వెళితే గేటు వద్దే మమ్మల్ని ఆపేశారు. ఈ విషయం మీడియాకు తెలిస్తే మా పరువు పోతుందని చెప్పలేదు. తర్వాత అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్లినా గేటు దగ్గరే ఆపేసారు. మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. బానిస బ్రతుకుకంటే హీనంగా మంత్రి పదవి ఉంది అంటూ ఈటెల మీడియా సమావేశంలో కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
నన్ను బర్తరఫ్ చేయడం చూసి హుజురాబాద్ ప్రజలంతా ఏదో కోల్పోయినట్లు భావించారు. అందుకే టీఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ ఈటెల ముగించారు.