బాలీవుడ్ లో గత ఏడాది జూన్ లో తాన్ ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి కొన్ని రోజులు జైలు పాలై బెయిల్ మీద బయటికొచ్చిన విషయం తెల్సిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కాస్తా బాలీవుడ్ సెలబ్రిటీస్ కి డ్రగ్స్ కేసుగా చుట్టుకుంది. ఆ కేసులో గత ఏడాది చాలామంది సెలబ్రిటీస్ ని ఎన్ సీబీ విచారించగా.. గత డిసెంబర్ నుండి ఆ కేసు విషయంలో ఎన్ సీబీ సైలెంట్ అయినా.. ప్రస్తుతం మరోసారి సుశాంత్ సింగ్ కేసులో ఎన్ సీబీ దూకుడు చూపిస్తుంది. రీసెంట్ గా సుశాంత్ సింగ్ మేనేజర్, సెలెబ్రిటీ పీఆర్వో అయిన సిద్దార్థ్ పితాని ని హైదెరాబాదులో అరెస్ట్ చేసి ముంబై కి తరలించిన విషయం తెలిసిందే.
తాజాగా సుశాంత్ సింగ్ కేసులో మరో అరెస్ట్ జరిగింది. సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ ఖాన్ ను ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేశారు. హరీశ్ ఖాన్ ముంబై లోని పలువురు సెలబ్రిటీస్ కి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని గుర్తించారు. ప్రస్తుతం హరీశ్ ఖాన్ ని, సిద్దార్థ్ పితానిని విచారిస్తున్నామని.. అయితే హరీశ్ ఖాన్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగ్ లలో అతనికి డ్రగ్స్ సరఫరాదారులతో లింకులున్నట్టు తేలడం వలనే అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి విచారణ సాగుతుంది అని కాకపోతే ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు