ఈరోజు మే 28 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి. ఆయన జయంతి రోజున ఎన్టీఆర్ కొడుకులు, కూతుర్లు కొంతమంది కరోనా కారణంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాకుండా ఇంటి వద్దనే ఆయనకి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మరో వారసుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి ఆయన సమాధిపై పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. ఇంకా సినిమా ప్రముఖులు, రాజకీయ నేతలు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
అయితే మెగాస్టర్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిరు ట్విట్టర్ వేదికగా ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం అని.. ఎన్టీఆర్ నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. అంటూ ట్వీట్ చేసారు.