ప్రముఖ పీఆర్వో, ప్రొడ్యూసర్ బిఎ రాజు గారి ఆకస్మిక మరణం జర్నలిస్ట్ లకి, తోటి పీఆర్వో లకే కాదు.. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. గత రాత్రి ఆయన గుండెపోటుతో కేర్ హాస్పిటల్ లో కన్నుమూయడంతో ఆయన చిన్న కొడుకు శివ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియచెయ్యడంతో.. అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజుగారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ హీరోలు, సీనియర్ హీరోలు, హీరోయిన్స్, ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ.. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. చిరు దగ్గరనుండి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరు బిఎ రాజు కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
బాలకృష్ణ: బి ఎ రాజు గారు...
ఆయనతో నాకు ఎప్పటినుంచో మంచి అనుభందం ఉంది. ఈరోజు ఆయన మనమధ్య లేరనే వార్త నన్నెంతో కలిచివేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
ఎన్టీఆర్:
బిఏ రాజు గారి అకాలమరణం నన్ను షాక్‌కు గురి చేసింది. సినీ జర్నలిస్ట్, పీఆర్వోగా సినీ పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలందించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మహేష్:
బిఏ రాజు గారి అకాలమరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నతనం నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాను. మా తండ్రి గారితో ఆయన అనుబంధం నాకు తెలుసు. మా కుటుంబమంటే ఆయనకు ఎనలేని గౌరవం. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదు ముఖ్యంగా మా కుటుంబానికి పెద్ద లోటు. రాజుగారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతాం
నాగార్జున:
37 సంవత్సరాలుగా నా స్నేహితుడు, ఆప్తుడు బిఏరాజు. ఆయన లేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఇకపై ఆయన్ని ఎంతో మిస్ అవుతాను. అలాగే ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద లోటు
వెంకటేష్:
బిఏ రాజుగారు.. నాకు మాటలు కూడా రావడం లేదు!! నా మొదటి సినిమా నుంచి ఆయన నాకు బాగా తెలుసు. భౌతికంగా ఆయన మనకు దూరం కావడం ఎంతో బాధగా ఉంది
చిరంజీవి:
B.A. రాజు గారు ఆకస్మిక మరణంతో షాక్ మరియు విచారానికి గురయ్యాను. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం.. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ఓ ప్రెస్ నోట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు చిరు.