నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించింది. అయితే జైలు లో రఘురామ కృష్ణం రాజుని కొట్టారంటూ ఆయన తరుపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వెయ్యడమే కాదు.. ఆయన తరుపున లాయర్లు నేరుగా హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. అయితే రఘురామరాజుని కొట్టారో లేదో.. జీజీహెచ్ అలాగే రమేష్ హాస్పిటల్స్ లో వైద్య పరిక్షలు చేసి కోర్టుకి సమర్పించాలని సీఐడీ పోలీస్ లని కోర్టు ఆదేశించగా.. జీజీహెచ్ లో రఘరామారాజుకి పరీక్షలు నిర్వహించి ఈయన్ని ఎవరూ కొట్టలేదని తేల్చేసారు. అయితే కోర్టు చెప్పినట్టుగా రమేష్ హాస్పిటల్ కి రఘురామ రాజుని సీఐడీ తీసుకెళ్లలేదు.
రమేష్ ఆస్పత్రిలో పరీక్షలు వద్దని.. మంగళగిరి ఎయిమ్స్‌లో అభ్యంతరం లేదని సిఐడి తరుపు లాయర్ వాదించారు. కానీ రఘురామరాజుని వైద్య పరీక్షల కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని, రాత్రి ఎనిమిది గంటల సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏపీ సిఐడి దానిని అమలు చేయలేదు. ఇక ఆ కేసు కాస్త సుప్రీం కోర్టుకి వెళ్లగా.. ముందు తక్షణమే రఘురామరాజుని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని.. అక్కడ అయ్యే వైద్య ఖర్చులు రఘురామరాజే భరించాలని, ఈ పరీక్షల సమయాన్ని జ్యుడీషియల్ కస్టడీగానే భావించాలని పేర్కొంది.
ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రఘురాజుకు చేసే పరీక్షలను వీడియోగ్రఫీ తీయాలని పేర్కొంది. అంతేకాకుండా రఘురాజు వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ ఆఫీసర్ ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని ఆదేశించింది. ఇక రఘురామ రాజు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశిస్తూ.. ఈ కేసుని శుక్రవారానికి వాయిదా వేసింది.