కరోనా.. కరోనా.. కరోనా.. దేశం మొత్తం కరోనా సెకండ్ వెవ్ తో అల్లాడిపోతోంది. కేంద్రం కూడా ఆయా రాష్ట్రాలని కరోనా కట్టడి చేసుకోమని వదిలేసింది. గత ఏడాది కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రధాని మోడీ స్వయంగా లాక్ డౌన్ అమలు చేయించారు. కానీ ఈ ఏడాది ఆయా రాష్ట్రాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోమని చెప్పడంతో.. కరోనా విపరీతంగా ఉన్న రాష్ట్రాలు తమకి తామే లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. కొన్ని స్టేట్స్ నైట్ కర్ఫ్యూ, డే కర్ఫ్యూ అంటూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో అక్కడ ప్రజలెవరూ రోడ్ల పైకి రాకుండా శివసేన ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. దానితో అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి . అలాగే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కఠినంగానే అమలు చేస్తున్నాయి.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 18 గంటల కర్ఫ్యులో విఫలమయ్యింది అనే చెప్పాలి. నిన్నటి నుండి ఈ నెల 18 వరకు ఏపీలో 18 గంటల కర్ఫ్యూ విధించింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఆంక్షల సడలింపు, మధ్యాన్నం 12 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టడంతో నిన్న ఎక్కడిక్కడ ఈ ఆంక్షలని పోలీస్ లు కఠినంగానే అమలు పరిచారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద భారీగా పోలీస్ ల మోహరింపు 12 తర్వాత రాష్ట్రంలోకి ఇతర వాహనాలు అనుమతించలేదు.
కానీ నేడు ప్రజలెవరూ ఈ ఏపీ ప్రభ్యుత్వం పెట్టిన కర్ఫ్యూని లెక్క చెయ్యడం లేదు. 12 గంటల తర్వాత ఏపీలోని విజయవాడ సిటీలో ప్రజలు భారీగా రోడ్ల మీద దర్శనమిస్తున్నారు. విజయవాడ వాసులు ప్రభుత్వం పెట్టిన కర్ఫ్యూని లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కరోనా కట్టడిలో ప్రభుత్వాలు తలమునకలవుతుంటే ఇలా ప్రజలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదని నిపుణులు అంటుంటే.. కర్ఫ్యూ కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమయ్యింది అంటూ ప్రతి పక్షాలు విరుచుకుపడుతున్నాయి.