ఏప్రిల్ 23న ఏపీలో ఏం జరగబోతోంది..? అంటే ప్రభుత్వం ఏమైనా మారుతుందని అనుకుంటారేమో.. అయినా అలా ఎందుకు అనుకుంటారులే..! ఎన్ని ప్రభుత్వాలు అప్పులు చేయడం లేదూ.. ఏపీ ప్రభుత్వం ఒక్కటేనా అప్పులు చేస్తుంది. అయినా వైసీపీ పథకాలు కరెక్ట్‌గానే అమలు చేస్తున్నారుగా..!. ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా ఉన్న వైసీపీ పార్టీని ఇప్పుడెవరు కదిలించలేరు కానీ.. అసలు విషయంలోకి వచ్చేద్దాం. రీసెంట్‌గా విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం తెలియంది కాదు. బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా చేసి పవన్ కల్యాణ్ సినిమాని ఆర్థికంగా దెబ్బకొట్టాలని వ్యూహాత్మకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. కేవలం పవన్ కల్యాణ్ సినిమా టికెట్ ధరల వల్లే ప్రజలకు నష్టం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉండటంతో.. భారీ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. అంతేకాదు, జగన్ నవరత్నాలలో ప్రజలకు పవన్ కల్యాణ్ సినిమా టికెట్లు తక్కువ రేట్లకు ఇప్పిస్తామనే రత్నం కూడా చేర్చుకుంటే బాగుంటుంది అనేలా కామెడీ పంచులు కూడా పేలాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఒక్కో జిల్లాకు రూ. 2 కోట్ల వరకు కలెక్షన్లు లాస్ అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలకు కూడా భారీ నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ నిర్ణయంతో నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. దీంతో రాబోయే పెద్ద సినిమాలకు ఆల్రెడీ అడ్వాన్స్‌లు ఇచ్చేసిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమానులు.. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 23న ప్రభుత్వంతో చర్చలు జరగనున్నాయని తెలుస్తుంది. ఈ చర్చల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్స్ పై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని వారు కోరనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. అయితే కావాలనే ఏపీ ప్రభుత్వం.. ఇలా చేస్తుందనే వారు కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్ సినిమా వరకు ఇబ్బందులు సృష్టించి.. తర్వాత ఇటువంటి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి.. వారి కోసం ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడమే ప్రభుత్వ వ్యూహం అనేలా కూడా వార్తలు వినవస్తున్నాయి. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో..?