‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క ‘వకీల్ సాబ్’ వరకేనా.. లేక రాబోయే ఇతర పెద్ద హీరోల సినిమాల విషయంలోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఇలాగే ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇకపై ఏపీలో విడుదలయ్యే ప్రతి సినిమాకు.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతోనే టికెట్స్ ఉంటాయి అనేలా ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేస్తుంది. అలాగే బెనిఫిట్ షోలు, అదనపు షోలు కూడా ఉండవని, అది ఎవరి సినిమా అయినా.. ప్రభుత్వ నిర్ణయం మారదు అనేలా అక్కడి అధికారులు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. సినీ పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాతలు, పెద్ద హీరోలు ఆలోచనలో పడితే.. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఓటీటీ సంస్థలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో.. సినిమాలు విడుదల చేస్తే.. లాస్‌లే తప్ప.. లాభాలు వచ్చే పరిస్థితి అస్సలు ఏ కోశానా కనబడటం లేదు. అందుకే థియేటర్లలో సినిమాలను విడుదల చేసి.. ప్రభుత్వాలతో గొడవలు పడేకంటే.. మంచి రేటుకి ఓటీటీ సంస్థలకు ఇచ్చేస్తే హాయిగా ఏ టెన్షన్ లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అనేలా దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. బిగ్ స్ర్కీన్‌పై ప్రేక్షకులకు సినిమా చూపించాలనే తాపత్రయంతో.. ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా.. కొందరు నిర్మాతలు ధైర్యంగా థియేటర్లలోనే సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ ఏపీ సృష్టించిన గందరగోళంతో.. నిర్మాతలు కూడా విసిగిపోయారు. అందుకే వచ్చిన కాడికి ఓటీటీలకు సినిమాలను అమ్మేసుకుంటే బెటర్ అనేలా.. ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మాత్రం.. ఇక సినిమా థియేటర్స్ అన్నీ కోళ్ల ఫారాలు లేదంటే.. నర్సరీలో అయిపోవడం ఖాయం. ఎటు చూసినా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని, ముఖ్యంగా థియేటర్ వ్యవస్థని కిల్ చేసేలానే ఉందనేది కొందరి విమర్శకుల భావన.