తిరుపతి ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతుంది. బిజెపి - జనసేన అభ్యర్థి కోసం బిజెపి నేతలు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేస్తున్నారు. వైసిపి పార్టీ కూడా తిరుపతి ఉప ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోపక్క టిడిపి అభ్యర్థి కోసం చంద్రబాబు, టిడిపి నేతలు కష్టపడుతున్నారు. వైసిపి అభ్యర్థి కోసం సీఎం జగన్ రంగం లోకి దిగుతాడని అన్నారు. వైసీపీ భయపడి ఏకంగా సీఎం జగన్ నే ప్రచారానికి తీసుకొస్తుంది అంటూ ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. సీఎం తిరుపతి పర్యటనకు, ప్రచారానికి అన్ని సిద్ధం చేసాక.. కరోనా పెరిగిపోతుంది.. ఇలాంటి టైం లో జగన్ తిరుపతి పర్యటన రద్దు అంటూ ప్రకటించారు.
అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా చంద్ర బాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో చంద్రబాబు వాహనంపై రాళ్లు వేసేందుకు దుండగులు ప్రయత్నించడం కలకలం రేపింది. కొందరు దుండగులు చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి కోసం యత్నించారు. ఆ రాళ్ల దాడిలో ఓ మహిళ, ఓ యువకుడు గాయపడినట్లుగా తెలుస్తుంది. తనపై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా చంద్రబాబు రోడ్డు పై నేలపై కూర్చుని నిరసన చేపట్టారు. అక్కడ ఇంతమంది పోలీస్ లు ఉండగా తనపై రాళ్ల దాడి చెయ్యడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని.. చంద్రబాబు అన్నారు. చంద్రబాబు కి సర్ది చెప్పేందుకు పోలీస్ లు శతవిధాలుగా ప్రయత్నించి నిరసన విరమించుకోమని కోరినా ఆయన వినడం లేదు. నేలపై కూర్చుని తమకి న్యాయం చెయ్యమని ఆయన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక టిడిపి కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.