పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాలిటిక్స్ విషయంలో ఒంటరిగానే ఫైట్ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు సినిమా ఇండస్ట్రీ తరుపు నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదు. ఆయనంటే ఇష్టం అనే వారు కూడా పాలిటిక్స్ పరంగా దూరంగా ఉన్నారు. ఎక్కడ ఏం మాట్లాడితే.. ఎటువంటి తలకాయనొప్పులు వస్తాయో అని.. అందరూ కామ్‌గానే ఉన్నారు. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత.. హమ్మయ్యా మనం సపోర్ట్ చేయకుండా ఉండటమే మంచిదైంది అని అనుకున్నవారు కూడా ఉన్నారు. కొందరైతే.. సినిమాల పరంగా ఓకే కానీ. . పాలిటిక్స్ పరంగా మాత్రం మేము వేరే పార్టీ అంటూ.. ఆ పార్టీకే కొమ్ము కాచారు. అందులో పవన్ అంటే ఎంతో అభిమానం చూపించే వారున్నారు. అలాగే పవన్ అభిమానం చూపించే వారు కూడా ఉన్నారు. అయినా సరే పవన్ ఒంటరిగానే పోరాడాడు. పోరాడుతున్నాడు.
ఇక పాలిటిక్స్ పక్కనెట్టి.. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. తాజాగా పవన్ కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే సినీ ఇండస్ట్రీలో చలనం లేకపోవడం.. విడ్డూరమనే చెప్పుకోవాలి. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని, అన్ని సదుపాయాలు సమకూర్చుతామని ఏపీ ప్రభుత్వం.. టాలీవుడ్‌కి చెందిన కొందరు పెద్దలతో వ్యవహారాలు నడుపుతూనే.. రాకపోతే ఏం చేస్తామో తెలుసా? అన్నట్లుగా ‘వకీల్ సాబ్’తో వారి అధికారాన్ని ప్రదర్శించారు. మరీ దారుణంగా కక్ష కట్టి మరీ ‘వకీల్ సాబ్’ సినిమాకు ఆర్థికంగా నష్టం చేకూర్చారు. అయినా సినీ పెద్దలలో స్పందనలేదు.
నిజంగా పవన్ కల్యాణ్ అంటే కోపం ఉంటే.. అది రాజకీయంగా చూపించి ఉంటే.. ఏపీ ప్రభుత్వం పట్ల సానుభూతి అయినా ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీని ఆహ్వానిస్తూనే.. ఒక సినిమాని నిర్దాక్షణంగా కిల్ చేయడం.. ఒక్క జగన్ ప్రభుత్వానికే సాధ్యమైంది. అయితే వకీల్ సాబ్ సినిమాపై ప్రభుత్వం ఇంత కుట్ర పూరితంగా వ్యవహరించినా.. ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ నోరు మెదపకపోవడం.. వారి భయాన్ని తెలియజేస్తుంది. చిరంజీవి స్పందిస్తే.. మళ్లీ కుటుంబ హీరో అని, తమ్ముడు కోసం అని ట్యాగ్ తగిలిస్తారు. అయినా చిరంజీవి ఒక్కడే స్పందించాల్సిన అవసరం లేదు. ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు. వారి సినిమాలకు కూడా రేపు ఇలాగే ఉంటుందని ఎందుకు అనుకోవడం లేదు. విడప్పుడు మేమంతా ఒకటే.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెబుతుంటారుగా.. మరి ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పాలిటిక్స్ పరంగా ఆలోచించి పవన్ కల్యాణ్‌ని పట్టించుకోలేదంటే ఓకే.. కానీ నిర్మాత దిల్ రాజుని చూసైనా వారు ఒక అడుగు ముందుకు వేయవచ్చు. అదీ లేదు. దీనికి కూడా బొట్టు పెట్టి పిలవాలా?. కష్టం వస్తే.. అందరూ చూసేది మెగాస్టార్ చిరంజీవి వైపే. అలాంటి చిరంజీవి ఫ్యామిలీ హీరో సినిమాపై ఇంత దారుణంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నా.. మళ్లీ ఒంటరివాడినే చేశారు కానీ.. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇప్పటికైనా ఇండస్ట్రీ ఓ నిర్ణయానికి రాకపోతే.. ముందు ముందు ఏపీలో ఏ టైమ్‌లో జీవోలు వచ్చినా నోరు మూసుకోకతప్పదు.