పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీనే సృష్టిస్తుంది. ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని హైకోర్ట్ అనుమతులు జారీ చేయడంతో.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త లెక్కలని ఈ వకీల్ సాబ్ క్రియేట్ చేయబోతున్నాడంటూ.. ఫ్యాన్స్ తీర్పులు ఇచ్చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన చిత్రమిది. అప్పటికీ ఇప్పటికీ ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు అనేదానికి నిదర్శనంగా హాల్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్, మరో వైపు ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వంటివి కూడా ఈ ‘వకీల్ సాబ్’ దూకుడును ఆపలేవు అనేంతగా ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు సినిమాలకు క్రిటిక్సే రివ్యూస్ ఇచ్చేశారు. కానీ ఫస్ట్ టైమ్ సెలబ్రటీలు కూడా ‘వకీల్ సాబ్’పై రివ్యూ ఇస్తుండటం విశేషం.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా సినిమాలోని ప్రతి పాయింట్‌ని టచ్ చేస్తూ.. రివ్యూ ఇస్తే.., తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా సినిమాని చూడడమే కాకుండా తనదైన స్టైల్లో ఒక రివ్యూని ట్విట్టర్ లో షేర్ చేశారు. వీరే కాదు పలువురు సెలెబ్రిటీలు ‘వకీల్ సాబ్’పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. ‘వకీల్ సాబ్’ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక చిరు రివ్యూ విషయానికి వస్తే.. ‘‘మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్... అదే వేడి, అదే వాడి, అదే పవర్! ప్రకాష్ రాజ్ తో కోర్టు రూమ్ అద్భుతం! నివేదా థామస్, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ అందించిన థమన్, డిఓపి వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ కపూర్‌గారికి, మిగతా టీమ్‌కి నా శుభాకాంక్షలు. అన్నింటికీ మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియచేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. వకీల్ సాబ్ కేసులనే కాదు... అందరి మనసుల్ని గెలుస్తాడు.’’ అంటూ తన అభిప్రాయం తెలిపాడు చిరు. ఈ ‘వకీల్ సాబ్’ అందరి మనసుల్ని గెలుస్తాడు.. ఇదే చిరు ట్యాగ్‌లైన్!