వ్యక్తిని దెబ్బకొట్టలేనప్పుడు.. అతని వ్యక్తిత్వాన్ని కించపరచాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఉంది ఇప్పుడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీరు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ఏం చేయలేక.. ఇప్పుడు ఆయన సినిమా ‘వకీల్ సాబ్’కి ఆటంకాలు సృష్టించి.. అదేదో అంటారుగా.. ఆ ఆనందాన్ని పొందుతుంది వైసీపీ ప్రభుత్వం. లేదంటే రాత్రికి రాత్రి సరికొత్త జీవోలు జారీ చేయడమంటే.. నిజంగా ఇది రాజకీయ కక్షే అని అందరికీ అర్థమైపోతుంది. ఏపీలో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వాన్ని నిర్జీవం చేసి.. తిరుగులేని శక్తిగా ఎదగాలని ప్లాన్స్ చేస్తున్న వైసీపీని పవన్ తన జనసేనతో ధీటుగా ఎదుర్కొంటూ.. మరో ప్రత్యామ్నాయంగా మారాడు. ఇది మింగుడు పడని వైసీపీ.. ఆయనని రాజకీయంగా ఎదుర్కొలేక.. ఇప్పుడు.. ఆయన సినిమా విడుదల అవుతున్న సందర్భంగా.. ఇదే సమయం అనుకుని.. పిచ్చి పిచ్చి జీవోలను విడుదల చేసి.. సినిమాని ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తుంది.
వాస్తవానికి వైపీసీ ఏదైనా మంచి పని చేస్తే.. దానిని పవన్ సమర్థిస్తూనే ఉన్నాడు. కానీ వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు కూడా విసిగిపోయారు. అందుకే పవన్ కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలోనే టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన తిరుపతి సభలో వైసీపీని పవన్ ఎలా టార్గెట్ చేశాడో తెలియంది కాదు. ఇది మనసులో పెట్టుకున్న వైసీపీ నాయకులు.. రాజకీయంగా ఆయనని ఏం చేయలేక.. ఇప్పుడు ఆయన సినిమాకు అడ్డంకులు సృష్టించి ఆనందం పొందాలని చూస్తున్నారు. లేదంటే.. పెద్ద హీరో సినిమా విడుదలైనప్పుడు అదనపు షోలు, టికెట్స్ రేట్లు పెంచుకునే అనుమతులను రాత్రికి రాత్రి తీసేయడం ఏమిటి?. అలాగే సినిమా విడుదలకి ఒక రోజు ముందు కరోనా పేరుతో డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యాజమానులకు కొన్ని తాయిలాలు ప్రకటించడం ఏమిటి? వాటిని ఎప్పుడో ప్రకటించినా.. సినిమా విడుదలకు ముందు రోజే జీవో విడుదల చేయడం చూస్తుంటే.. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందనేది క్లియర్‌గా అర్థమైపోతుంది.
పవన్ సినిమా ఇంకాసేపట్లో విడుదలవుతుంది అనగా.. సినిమాని దెబ్బకొట్టడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. విడుదలవుతున్న సినిమాకు సంబంధించి అర్థరాత్రి ప్రభుత్వం ఓ జీవో విడుదల చేయడం నిజంగా వైసీపీ అరాచకానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్‌లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి. సింగిల్ థియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60 . ఈ టికెట్ రేట్లు… జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో మరింత తక్కువ. ఈ రేట్లు చూస్తుంటే.. వకీల్ సాబ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం ఎవరితరం కాదు.. అలాగే ఇలాంటి పిచ్చ పిచ్చ జీవోలు ఇచ్చి.. పవన్ కల్యాణ్ సినిమాని ఆపడం కూడా మీ తరం కాదంటూ.. పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే సినిమాకి ఇబ్బందులు కలిగించడం తప్ప.. మీరు పవన్ కల్యాణ్‌ని ఏం చేయలేరని, కళ్లు మూసుకుంటే.. మీకు పవనే గుర్తొస్తున్నాడు కాబట్టే.. ఇలా ప్రత్యేకంగా టార్గెట్ చేశారని.. వారు ఆరోపిస్తున్నారు.