కరోనా లాక్ డౌన్ థియేటర్స్ వ్యవస్థను భారీగా దెబ్బకొట్టింది. కనీసం కరెంట్ బిల్స్ కట్టలేక థియేటర్స్ యాజమాన్యాలు విలవిల్లాడారు. డిసెంబర్ నుండి సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా థియేటర్స్ ని కోలుకోనివ్వలేదు. కానీ సంక్రాతి జోరులో విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. జనవరిలో విడుదలైన క్రాక్ మంచి హిట్ అవడంతో థియేటర్స్ కాస్త కుదుట పడ్డాయి. వారం వారం సినిమాలొచ్చినా.. ఉప్పెన సినిమా వచ్చేవరకు బాక్సాఫీసు డల్ అయ్యింది. ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన మరోసారి ఊపునిచ్చింది. తర్వాత జాతి రత్నాల టైం వరకు థియేటర్స్ లో ప్రేక్షకుల శాతం తగ్గింది. సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే తప్ప మునుపుటిలా థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదు. గతంలో అయితే టైం పాస్ కోసమైనా శని, ఆదివారాల్లో థియేటర్స్ కళకళలాడేవి.
కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన మారింది. కరోనా ఒక కారణం కూడా అయ్యింది. జాతి రత్నాలు హిట్ తర్వాత బాక్సాఫీసు దగ్గర టికెట్స్ బాగా తెగాయి. మళ్ళీ వారం విడుదలైన చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి సినిమాలు ఘోరంగా నిరాశ పరిచాయి. ఫస్ట్ డే చావు కబురు చల్లగా కలెక్షన్స్ అలా అలా ఉండగా సెకండ్ డే నుండి డల్ అయ్యింది. ఇక మోసగాళ్లు, శశి థియేటర్స్ మరీ ఘోరం. ప్రేక్షకులు లేక వెలవెల బోవడమే కాదు.. కొన్నిచోట్ల మోసగాళ్లు, శశి థియేటర్స్ లో ప్రేక్షకులు లేక షోస్ నిలిపేశారు. కనీసం కరెంట్ బిల్స్, థియేటర్స్ రెంట్ అయినా మిగులుతుంది అని, కరోనా లేకముందు ఇంతగా ప్రేక్షకులు సినిమాలను పట్టించుకోకుండా లేరు. కానీ కరోనా లాక్ డౌన్ ముగిసాక.. సో సో టాక్ వచ్చిన సినిమాల వైపు ప్రేక్షకులు తలెత్తి చూడడం లేదనేది ఈ వారం సినిమాలు నిరూపించాయి.