ఉప్పెన సినిమాతో సుకుమార్ రైటింగ్స్ కి భారీ క్రేజ్ వచ్చి పడింది. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా తన రైటింగ్స్ లో సినిమాలు చేస్తున్న సుకుమార్ తాజా ఆణిముత్యం ఉప్పెన. ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు సూర్య కిరణ్ సుకుమార్ రైటింగ్స్ లోనే 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఉప్పెన హిట్ అయ్యాక 18 పేజెస్ పై క్రేజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా సుకుమార్ రైటింగ్స్ నుండి మరో సినిమా మొదలు కాబోతుంది.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై యంగ్ హీరో కార్తికేయ హీరోగా నవంబర్ నుంచి కొత్త సినిమా మొదలవుతుంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్, ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మార్చి 19న విడుదల అవ్వనున్న కార్తికేయ అప్ కమింగ్ మూవీ చావు కబురు చల్లగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్రసై సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. నవంబర్ లో ప్రారంభం అవ్వనున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు. దర్శకుడు, తదితర వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.