గత శుక్రవారం విడుదలైన నాంది, చక్ర, పొగరు, కపటధారి సినిమాల్లో కనీస వసూళ్ళని కూడా రాబట్టుకోలేక అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది సుమంత్ హీరోగా నటించిన కపటధారి. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా.. తమిళంలో రీమేక్ అయ్యి.. అబోవ్ యావరేజ్ అనిపించుకున్న సినిమా తెలుగులో మాత్రం ఇలా చతికిల పడడం ఆ సినిమా నిర్మాతలకు మింగుడు పడడం లేదు. మంచి కాన్సెప్ట్, మంచి ట్విస్ట్, మంచి సబ్జెక్టు మినిమమ్ గ్యారెంటీ సినిమా అనుకుని ఎంతో నమ్మకంగా కన్నడ నుండి హక్కులు దక్కించుకుని తెలుగులోకి తీసుకొస్తే ఇలాంటి డిజాస్టర్ రిజల్ట్ ని కపటధారి నిర్మాతలు ఊహించలేదు.
నిజానికి ఈ సినిమాని మొదట రాజశేఖర్ హీరోగా మొదలు పెడదామని అనుకోవడమే కాదు.. పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. కానీ అంతర్గత కారణాల వలన రాజశేఖర్ తో మొదలు కావాల్సిన సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సీన్ లోకి ఎంటర్ అయ్యాడు హీరో సుమంత్. సుమంత్ హీరోగా కపటధారి కంటిన్యూ అవడం కంప్లీట్ అవడం జరిగింది. ఎప్పటినుండో రిలీజ్ అనుకున్నా అది కాస్తా తిరిగి తిరిగి వచ్చి నాలుగు సినిమాల మధ్యలో పడి నలిగిపోయింది. ఈ నాలుగు సినిమాల మధ్యలో పడడం వలన నలిగింది అనుకోవాలా? లేదంటే సుమంత్ కి జనాకర్షణ కొరవడింది అనుకోవాలా? ఏదేమైనా ఈ సినిమా రిజల్ట్ మాత్రం మరీ నిరాశాజనకంగా ఉండడంతో నీరస పడిపోయారు నిర్మాతలు. మొదట అనుకున్నట్టు రాజశేఖర్ హీరోగా చేసుండి ఉంటే మరీ ఇంత నాసిరకంగా రిజల్ట్ మాత్రం వచ్చేది కాదు అనేది కపటధారి నిర్మాతల అభిప్రాయం.