వరలక్ష్మి శరత్ కుమార్ అంతకుముందు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోకి రావడమే తప్ప నేరుగా తెలుగు ప్రేక్షకులని పలకరించింది చాలా తక్కువ. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ ఎల్. ఎల్. బీ అంటూ తెలుగులోకి నేరుగా ఎంట్రీ ఇచ్చినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా సంక్రాంతి పండగ రేస్ లో ఉన్న క్రాక్ సినిమాతో మాత్రం అందరిని షాక్ కి గురిచేసే పెరఫార్మెన్స్ తో వరలక్ష్మి అందరి చూపు తన మీద పడేలా చేసుకుంది. సంక్రాంతి సీజన్ లో సూపర్ హిట్ కొట్టి తెలుగునాట తన జెండా పాతింది అని అనుకునేలోపే.. నెల తిరక్కుండానే అల్లరి నరేష్ నాంది సినిమాలో లాయర్ కోటు తొడుక్కుని మరీ వచ్చేసింది.
వకీల్ సాబ్ వచ్చి వాదిస్తాడనుకుంటే.. వాగ్దాటికి తనేం తీసిపోనంటూ.. కోర్టు సీన్స్ లో చాలా అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. నాంది సినిమాలో లాయర్ ఆద్య గా వరలక్ష్మి కేరెక్టర్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అల్లరి నరేష్ తో సమానమైన పెరఫార్మెన్స్ తో వరలక్ష్మి అదరగొట్టేసింది అంటున్నారు. మరి బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టేసిన వరలక్ష్మి ఇప్పుడు తెలుగు దర్శకనిర్మాతలకు హాట్ కేక్ లా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ కొంతమంది కొత్త కథలు రెడీ చేస్తున్నారు. అలాగే కొన్ని కొత్త కేరెక్టర్స్ సృష్టిస్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు అంటే వరలక్ష్మి కి క్రాక్, నాంది హిట్స్ ఎంతగా పేరు తెచ్చాయో అర్ధమవుతుంది.