విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పెంచుతుంది. టిడిపి మొత్తం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తుంది. వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఏం మాట్లాడకుండా మౌనం గా ఎందుకు ఉన్నారంటూ టిడిపి, ఇతర ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీని కలవబోతున్నారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా టిడిపి ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరా రావు తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసారు. వైసిపి అధికారంలోకి వచ్చాక విశాఖ టిడిపి కార్యకలాపాల్లో అంటీముట్టనట్టు ఉంటున్న గంటా శ్రీనివాసరావు మధ్యలో వైసిపి తీర్థం పుచ్చుకోబోతున్నారనే న్యూస్ నడిచింది.
కానీ వైసిపి ప్రభుత్వంలోని స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే వైసిపి విశాఖ శ్రేణులు గంటాని వైసిపి లోకి రాకుండా అడ్డుకుంటున్నాయనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అప్పటినుండి టిడిపిలో ఉండలేక, వైసిపిలోకి రాలేక కామ్ గా సైలెంట్ గా ఉంటున్న గంట శ్రీనివాస్ కి ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆయుధంగా మారింది. వెంటనే పార్టీ పదవికి రాజీనామా చేసి.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ.. అందులో భాగంగా తానే మొదట నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. రాజీనామా చేసి రాజీనామా లేఖని స్పీకర్ కి పంపారు. ఇక విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని కూడా గంటా ప్రకటించారు.