నిన్న మొన్నటివరకూ రిలీజ్ డేట్ ల వ్యవహారం రాద్ధాంతంలా అనిపించింది. రానురానూ రణరంగంలా కనిపించింది. ఇప్పుడు అది కాస్తా చదరంగంలా మారిపోయింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
కరోనా కల్లోలం తర్వాత ఎట్టకేలకు థియేటర్స్ తెరుచుకుంటే బిక్కుబిక్కుమంటూ రావాల్సిన సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఒకదాన్ని ఒకటి ఎక్కి తొక్కుకుంటూ వచ్చాయి. దాంతో పంపిణీదారుల వివాదాలు ప్రెస్ మీట్ల వరకు వెళ్లాయి. ఎగ్జిబిటర్ల సమస్యలు సినీ పెద్దల ముందుకు చేరాయి.
ఆ వివాదాల పరిష్కారం కానీ, దానికి సంబందించిన వివరాలు కానీ ఇంకా వెలువడకముందే.. మళ్ళీ రిలీజ్ డేట్ ల వేట మొదలైపోయింది. థియేటర్ల కబ్జాకి కబడ్డీ స్టార్ట్ అయిపోయింది.
అందుకు నిదర్శనమే నిన్న ఉన్న ఫళంగా ఊడి పడ్డ పలు చిత్రాల విడుదల తేదీలు అంటూ వ్యాఖ్యానించారు ఓ ప్రసిద్ధ పరిశ్రమ వ్యక్తి. ఇది నాది, అది నాది అంటూ సీట్ మీద కర్చీఫ్ వేసినట్టు డేట్ తో పోస్టర్ వేసుకుంటూ పోయాయి పలు సినిమాలు.. వాటిని తీస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు.
వాటి సంగతి అలా ఉంటే ఆగస్టు ఫస్టు వీక్ లో వద్దాం అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట కి ఛాలెంజ్ విసిరే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ డేట్ ఆగస్టు 13 అని ప్రకటించారంటూ సోషల్ మీడియా హోరెత్తింది. అభిమానుల మధ్య ట్వీట్ల వారూ జరిగింది. మరీ విషయం మహేష్ దృష్టికి వెళ్లిందో లేదో కానీ లేటెస్ట్ గా వినిపిస్తోన్న బజ్ ఏమిటంటే మహేష్ ప్రొడ్యూస్ చేస్తోన్న అడివి శేష్ మేజర్ మూవీని ఆగస్టు 15 న, అలాగే మహేష్ ఓన్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సినిమా మహా సముద్రం ని ఆగస్టు 19 న విడుదల చేసేందుకు ప్లాన్ సిద్దమైందట. ఇదే నిజమైతే కొందరు తల వంచాల్సిందే. తప్పక థియేటర్లు పంచాల్సిందే. మహేష్ కి తెలిసి జరిగినా, లేక మహేష్ వర్గీయులే చేస్తున్నా ఈ ఎత్తుగడ మాత్రం మహేష్ స్థాయికి తగ్గదే అంటున్నారు పలువురు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా..!
మరి తెరపైకి వచ్చాక ఏ సినిమా జాతకం ఎలా ఉంటుందో కానీ అప్పటివరకు మాత్రం బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం అన్నట్టే ఉంది చూస్తుంటే..!