సామి.. ఇది నువ్వు కాచిన బిడ్డ.. అమ్మ వడిలో నువ్వు దాచిన బిడ్డ..532, అంటూ ఖలేజా సినిమాలో హీరో మహేష్ గురించి ఆ ఊరి పూజారి చెప్పిన డైలాగ్స్ అది.. కానీ రీల్ లైఫ్ లో చెప్పిన ఆ డైలాగ్ ని రియల్ లైఫ్ లో నిజం చేస్తున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహేష్ బాబు.. చిన్నారుల గుండె సంబంధ సమస్యలతో బాధ పడుతున్న పిల్లలను కాపాడే యజ్ఞాన్ని మొదలెట్టాడు. మహేష్ చేస్తున్న ఈ మహత్తర యజ్ఞం నిరంతరం సఫలీకృతం అవుతూనే ఉంది.. ఎందుకంటే మహేష్ చేస్తున్నది మాములు యజ్ఞం కాదు.. ఏ అభం శుభం ఎరగని పసి పిల్లల గుండె జబ్బులను బాగుచేయించే మహత్తర కార్యక్రమం అది.
ఇప్పటి వరకు మహేష్ బాబు కాపాడిన ప్రాణాలు.. 1019. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారముతో ఓ చిన్నారి గుండె సమస్యను నయం చేసినట్టు మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా పేర్కొనడంతో మహేష్ కాపాడిన ప్రాణాల సంఖ్య 1019 కి చేరింది. సూపర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి చిన్న పిల్లల గుండె సమస్యల గురించి చేస్తున్న ఈ మహా యజ్ఞం అనితర సాధ్యంగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పాడు మహేష్. ఇంత గొప్ప సాయం చేస్తున్నా కూడా ఎక్కడ గొప్పలకు పోకుండా మహేష్ సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తూనే ఉన్నాడు. ఎదో కొంత సాయం చేసి.. గొప్పలు చెప్పుకునే జనాలున్న ఈ జనారణ్యంలో.. నిజంగా మహేష్ చిన్న పిల్లల పాలిట దేవుడిగా మారిపోయాడు. ఈ సందర్బంగా అందరం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.