ఓం రౌత్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోతున్న ఆదిపురుష్ అప్పుడే న్యాయపరమైన చిక్కుల్లో పడింది. రాముడి అవతారంలో ప్రభాస్, రావణ్ అవతారంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్న ఆదిపురుష్ పై రావణ్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. రావణుడిని పాజిటివ్ గా చూపించబోతున్నారని, సీతాపహరణం కరెక్ట్ అనేలా సైఫ్ చేసిన వ్యాఖ్యలు ఉండడంతో అప్పట్లోనే బిజెపి నేతలు ఆదిపురుష్ డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు. కానీ సైఫ్ వెంటనే దిగొచ్చి తన మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి అప్పటితోనే ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు.
అందరూ అనుకున్నట్టుగా ఆదిపురుష్ వివాదం ఇంకా ముగియలేదు. ఇప్పుడు సైఫ్ చేసిన వ్యాఖ్యల ఫలితం ఆదిపురుష్ కోర్టుకెక్కింది. సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఉత్తరప్రదేశ్ కి చెందిన హిమన్షు అనే న్యాయవాది సినిమాపై జౌన్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మాత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేవిలా ఉన్నాయంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫ్ ని మాత్రమే కాదు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పేరుని కూడా న్యాయవాది హిమాన్షు తన పిటిషన్ లో పేర్కొన్నాడు.