గత వారం దీపావళి కి సూర్య `ఆకాశం నీ హద్దురా` సినిమా థియేటర్స్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి ప్రేక్షకుల చెంతకు చేరింది. ఓటిటిలో ఆకాశం నీ హద్దురా విడుదలైన మూడు గంటలకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సూర్య ఫాన్స్ మాత్రమే కాదు.. సినిమా చూసిన వాళ్ళ నోటి నుండి వచ్చిన మొదటి మాట. సూర్య నటనను, అలాగే సుధా కొంగర దర్శకత్వాన్ని, హీరోయిన్ అపర్ణ బాల నటనను, సూర్య స్నేహితులుగా నటించిన వారిని ప్రేక్షకులు తెగ పొగిడేశారు. నిర్మాతగా సూర్య కి భారీ విజయం అందుకున్నాడు. కొన్నాళ్లుగా హిట్ కొట్టలేకపోతున్న సూర్య కు ఆకాశం నీ హద్దురా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో సూర్య సినిమాకి సూపర్ టాక్ పడడంతో.. ఆ సినిమా రెండు రోజులు బాగా ట్రెండ్ అయ్యింది. అయితే ఫాన్స్, ప్రేక్షకులు మెచ్చిన సినిమాకి సెలబ్రిటీస్ స్పందన కరువయ్యింది. మంచి ఫీల్ ఉన్న సినిమాలు చూసిన తర్వాత టాప్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడంతో వాటికీ మంచి పబ్లిసిటీ వస్తుంది. కానీ ఆకాశం నీ హద్దురా సినిమా విషయంలో అది జరగలేదు. ఎందుకంటే కరోనాతో ఆగిపోయిన షూటింగ్స్ అన్ని అక్టోబర్ నుండి మెల్ల మెల్లగా స్టార్ట్ అవడంతో.. దర్శకనిర్మాతలు, హీరోలు అంతా సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. రాత్రి పగలు సినిమా షూటింగ్స్ అంటూ హడవిడిగా పరుగులుపెడుతున్నారు.
అందుకే వాళ్లకు సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా చూసే అవకాశం రాలేదేమో.. సూర్య ఆకాశం నీ హద్దురా చూసిన క్షణమే వెంకీ సినిమా సూపర్ అంటూ టీం కి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆకాశం నీ హద్దురా టీం మీద ప్రశంశల జల్లు కురిపించాడు. ఇక తమిళ సెలెబ్రిటీస్ చాలామంది సూర్య సినిమాని ఆకాశానికి ఎత్తేసి ప్రమోట్ చేసారు. అయితే చాలామంది ఈ సినిమాని చూడకే తమ అభిప్రాయాలను తెలపలేదు కానీ.. థియేటర్స్ లో విడుదలై హిట్ అయితే సెలబ్రిటీస్ స్పందన లేకపోయినా ఓకె కానీ.. ఇలా ఓటిటీలలో విడుదలైనప్పుడు ఆయా హిట్ సినిమాలకు సెలబ్రిటీస్ సపోర్ట్, పబ్లిసిటీ ఉంటేనే అవి మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతాయి అనేది వాస్తవం.