పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పోలీస్ కథతో సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ చాలామంది అభిప్రాయం అదే.
ఐతే పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తే, మరో పాత్రలో ఎవరు కనిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయమై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. కన్నడ స్టార్ సుదీప్ మరో హీరోగా కనిపించబోతున్నాడని అంటున్నారు. తెలుగులో రానా పేరు వినిపించినప్పటికీ చిత్రబృందం నుండి గానీ అటు రానా నుండి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా మెప్పించిన సుదీప్, పవన్ సినిమాలో నటిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరో పక్క పవన్ పక్కన నటించడానికి తెలుగులో నటులే లేరా అని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటి నడుమ పవన్ పక్కన నటించే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.