కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉన్నందున ఇక చేసేదేమీ లేక సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటు తెలుగు ఇండస్ట్రీ నుండి మొదలెడితే బాలీవుడ్ ఇండస్ట్రీ దాకా ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఐతే ఓటీటీలో రిలీజైన చిత్రాలకి సరైన స్పందన రావడం లేదు. ఒక్క తెలుగులోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.
థియేటర్లు మూతపడినందున ఇంట్లో కూర్చుని వినోదం ఆశిస్తున్న జనాలకి మరింత పరీక్ష పెడుతున్నట్లుగా నీరసంగా ఉంటున్నాయి. ఒకటి లేదా రెండు చిత్రాలు మినహా మిగతా వాటిదంతా ఇదే తంతు. ఓటీటీలో రిలీజైన ప్రతీ సినిమాకి ఇలాంటి రివ్యూసే వస్తుంటే ఓటీటీ వేదికలపై నమ్మకం తగ్గిపోతుంది. థియేటర్లలో రిలీజ్ చేస్తే ఫ్లాప్ అవుతాయనుకున్న సినిమాలనే ఓటీటీలకి అమ్ముతున్నారని, ఇటు ఓటీటీ వారేమో, ఏదైతే ఏంటీ కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకి అందించాలన్న ఉత్సాహంతో సినిమాలు కొంటున్నారనీ, దీనివల్ల సరైన సినిమాలు ఓటీటీ ద్వారా రావట్లేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.
ఈ రోజు రిలీజైన రెండు సినిమాలకి వచ్చిన రివ్యూస్ చూస్తుంటే ఓటీటీలో మంచి సినిమా చూడలేమా అన్న అనుమానం కలుగుతుంది. ఐతే ఈ ప్రభావం వచ్చే సినిమాలపై పడనుందని తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లు తెరుచుకుంటాయి కాబట్టి, ఓటీటీ వాళ్ళు కొంచెం మెరుగైన కంటెంట్ అందిస్తేనే బాగుంటుంది. లేదంటే ఓటీటీలపై నమ్మకం తగ్గిపోతుందని అంటున్నారు.