దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్‌లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ... ‘‘రాము గారు ఒక సూపర్ హ్యూమన్. టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఆయన జర్నీ అద్భుతం. ఇప్పటికీ రాము గారు సినిమాల పట్ల చూపించే ప్యాషన్ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన బయోపిక్ తీసే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది. రాము గారి మూడు భాగాల బయోపిక్ లో పార్ట్ 1 షూటింగ్ ఇవాళ ప్రారంభించాం. ఆర్జీవీ మాతృమూర్తి సూర్యావతి, సోదరి విజయ గారు షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దర్శకుడు దొరసాయి తేజ రాము గారి టీనేజ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. నగరంలోని ఓ కాలేజ్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం నుంచి మొదలై 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇతర పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం..’’ అన్నారు.