థియేటర్లన్నీ మూసి ఉన్న కారణంగా సినిమాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. ముందు వద్దనుకున్నా, కాలం చకచకా పరుగులు తీయడంతో, పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఓటీటీలకి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఐతే అందరూ ముందడుగు వేస్తున్నా కానీ లవ్ స్టోరీ చిత్రం ఎటూ తేల్చుకోలేక సతమతమవుతోందని వినిపిస్తుంది.
నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొంభైశాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. వన్స్ షూటింగ్ పూర్తికాగానే చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగుంచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఐతే అప్పటి వరకూ థియేటర్లు ఓపెన్ అవుతాయా లేదా అన్నదే ప్రశ్న.
ఒకవేళ థియేటర్లు ఓపెన్ కాకపోతే ఓటీటీకి అమ్ముతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే లవ్ స్టోరీ చిత్రన్ని నిర్మిస్తున్నది ఏషియన్ సినిమాస్ యజమానులే. డిస్ట్రిబ్యూషన్ లో ఎన్నో ఏళ్ళుగా ఏలుతున్న ఏషియన్ సినిమాస్ యాజమాన్యం, తాము మొదటిసారిగా నిర్మించిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేదే ప్రశ్న. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అవుతుంటే మల్టీప్లెక్స్ యాజమాన్యాల నుండి వ్యతిరేకత వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో లవ్ స్టోరీ ఓటీటీలోకి రావడం కష్టమే.