కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగులన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ తమ సినిమాల చిత్రీకరణ మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో ముందున్నారు. ఒక్కొక్కరుగా హైదరాబాద్ కి క్యూ కడుతున్నారు. సీనియర్ హీరోలు సైతం షూటింగులకి ఓకే చెబుతున్నారు. మొన్నటికి మొన్న నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రీకరణ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్లో అడుగుపెట్టాడు. యాడ్ షూట్ నిమిత్తం బయటకి వచ్చిన మహేష్ బాబు సెట్లో దర్శనమిచ్చాడు. మహేష్, యాడ్ దర్శకుడు మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటకి వచ్చాయి. బ్యాగ్రౌండ్ లో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్న యాడ్ యూనిట్ కనిపించింది. ఈ షూటింగ్ రెండు రోజులు ఉంటుందిట. ఈ రోజు మొదలుకుని రేపటితో పూర్తవుతుందన్నమాట. మొత్తానికి మహేష్ సెట్లో కనిపించడం అందరికీ ఉత్సాహాన్నిచ్చింది.
ఈ ఉత్సాహంలో సర్కారు వారి పాట షూటింగ్ ఎప్పుడు మొదలవనుందనేది ఆసక్తిగా మారింది. యాడ్ కోసం బయటికిచ్చిన మహేష్, సర్కారు వారి పాట కోసం ఎప్పుడు వస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.