ఎన్‌సీబీ విచారణలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన మిస్టరీ ప్రతిరోజూ కొత్త మలుపులు బయటపడుతుండటం కారణంగా మరింత మురికిగా మారుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రియా చక్రవర్తి తమ్ముడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్ మిరాండాలను అరెస్టు చేయడంతో, ఈ కేసులో ఇటీవల హైలైట్ అయిన అక్రమ మాదకద్రవ్యాల కోణంపై అందరి దృష్టీ పడుతోంది. అంతే కాదు.. రియాపై పట్టు బిగించిన ఎన్‌సీబీ, ఈ కేసులో ఆమెను ప్రశ్నలతో ముప్పతిప్పలు పెడుతోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, విచారణలో భాగంగా రియాను సోమవారం మళ్ళీ పిలిపించి ప్రశ్నించింది ఎన్‌సీబీ బృందం.
ఇంటరాగేషన్ జరుగుతుండగా, టైమ్స్ నౌ ప్రకారం, డ్రగ్స్ సేకరించాననీ, జైద్ విలాత్రాతో ఈ విషయంలో కోఆర్డినేట్ చేశాననీ రియా అంగీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో తన తమ్ముడు షోవిక్ చురుకైన పాత్ర పోషించాడని ఒప్పుకున్న ఆమె.. శామ్యూల్ మిరాండా, దీపేష్ సావంత్ ద్వారా ఆ డ్రగ్స్ సుశాంత్ కోసం వచ్చేవని ఆమె తెలిపింది. అంతేనా!. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అనేక మంది ప్రముఖుల పేర్లను ఆమె వెల్లడించిందని చెబుతున్నారు. అయితే, ఈ పేర్లను ఆమె ఏ సందర్భంలో బహిర్గతం చేసిందనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ మధ్యలో, ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న శామ్యూల్ మిరాండా, దీపేష్.. ఇద్దరూ సుశాంత్ సింగ్ ఫామ్‌హౌస్‌లో పార్టీలు జరిగేవనీ, డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి, డ్రగ్స్ తీసుకునేవారనీ తమ స్టేట్‌మెంట్లలో వెల్లడించారు. సుశాంత్ కోసం అక్రమ మాదకద్రవ్యాలను కొనుగోలు చెయ్యడం వెనుక రియా చక్రవర్తి ఉన్నట్లు వారు వెల్లడించారు.