గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా నిర్మాతలు మళయాల చిత్రాలపై మక్కువ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి చిత్రాలని తెలుగులోకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే మళయాలం నుండి తెలుగులోకి రీమేక్ అవుతున్న చిత్రాల జాబితాలో అయ్యప్పనుమ్ కోషియం కూడా ఉంది. ఈ చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఇందులో నటించే హీరోల వెతుకుతుంది.
మొదటగా బాలక్రిష్ణ, రానా దగ్గుబాటి చేస్తున్నారని వినిపించింది. ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా చూసిన పవన్ కళ్యాణ్, రీమేక్ లో తాను నటించేందుకు ఆసక్తి చూపించాడట. ఈ మేరకు ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సితార ఎంటర్ టైన్ మెంట్స్ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు.
పవన్ కళ్యాన్ ఫోటోని అయ్యప్పనుమ్ కోషియం సినిమాలోని స్టిల్ తో జత చేస్తూ విషెస్ తెలిపారు. అయ్యప్పనుమ్ కోషియం సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఇది అర్థం అవుతుంది. సో.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.