సినిమాల్లో నిలబడాలంటే సక్సెస్ కంపల్సరీ.. సక్సెస్ రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొన్ని సార్లు ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు అంత తొందరగా రావు. టాలెంట్ ఉన్నా అవకాశాలు సరిగ్గా రాక తమ ప్రతిభ బయటకి కనిపించకుండా పోతున్న వారెందరో ఉన్నారు. ఒకవేళ వచ్చినా సక్సెస్ రాక సరైన గుర్తింపుకి నోచుకోని వారు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ ఆదాశర్మ ఆ కేటగిరీలోకే వస్తుంది.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ అటాక్ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆదా శర్మ, ఆ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో, క్షణం సినిమాలో నటించింది. క్షణం సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కల్కి సినిమాలో చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఐతే తాజాగా ఆదా శర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించింది.
క్వశ్చన్ మార్క్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి టైటిల్ పోస్టర్ రిలీజైంది. ఎరుపు రంగుతో కనిపిస్తున్న క్వశ్చన్ మార్క్ టైటిల్ ని చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ సినిమాగా అనిపిస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని విప్ర అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపిస్తున్న ఈ అమ్మడుకి క్వశ్చన్ మార్క్ ద్వారానైనా మంచి హిట్ లభిస్తుందేమో చూడాలి.