అర్జున్ రెడ్డి సినిమా తెలుగు నాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఐతే ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని వార్తలు వచ్చాయి. విజయ్ కూడా సందీప్ తో మళ్ళీ సినిమా చేస్తానని ప్రకటించాడు కూడా. తాజా సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కనుందట.
ఐతే అది సినిమా కాదు. వెబ్ సిరీస్. అందులో హీరో విజయ్ కాదు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ. నిర్మించేది విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ హిల్ పేరుతో ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రాన్ని నిర్మించాడు. తరుణ్ భాస్కర్ హీరోగా కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ నిర్మాతగా విజయ్ పేరు అందరికీ తెలిసింది.
ప్రస్తుతం ఈ బ్యానర్ లో రెండవ ప్రాజెక్ట్ మొదలు కాబోతుందని సమాచారం. ఆ ప్రాజెక్ట్ సందీప్ వంగాతోనే ఉంటుందని అంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాల తర్వాత సందీప్ వంగా నెక్స్ట్ చిత్రంపై రకరకాల కథనాలు వచ్చాయి. అందులో ఇది కూడా ఒక ఊహాగానమే. మరి ఇదైనా నిజమై సందీప్ వంగా సినిమా తెరకెక్కుతుందేమో చూడాలి.