ఇటీవల ఓటీటీలో విడుదలైన అన్ని చిత్రాల్లోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చిత్రం ఏదంటే ఉమామహేశ్వర్ ఉగ్రరూపస్య అనే చెప్పాలి. యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఐతే ఓటీటీలోకి వచ్చిన సినిమాలన్నింటికీ పైరసీ బెడద చాలా ఉంది. చాలా ఆన్ లైన్ సైట్స్ డైరెక్ట్ గా సినిమా లింక్ ని పెట్టేస్తున్నాయి. థియేటర్లు మూతబడి ఇబ్బందులు పడుతున్న నిర్మాతలకి ఓటీటీనే మంచి అవకాశం అనుకుంటున్న సమయంలో పైరసీ మరింత ఇబ్బంది పెడుతుంది.
ఆ పైరసీ సెగలు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి కూడా తాకాయి. ఈ సినిమా లింక్ ని డైరెక్టుగా యూట్యూబ్ లో పెట్టేసారు. ఐతే ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి అమ్మిన చిత్ర నిర్మాతలు శాటిలైట్ హక్కులని ఈటీవీకి అప్పగించారు. ఈటీవీ ఇంకా ఈ చిత్రాన్ని టెలిక్యాస్ట్ చేయకుండానే హైదరాబాద్ లోకల్ ఛానెల్ వాళ్ళు అత్యుత్సాహం చూపి తమ ఛానెల్లో టెలిక్యాస్ట్ చేసారు. శాటిలైట్ హక్కులు ఈటీవీ దగ్గర ఉంటే ఇలా వేరే ఛానెల్ వారు అక్రమంగా టెలిక్యాస్ట్ చేయడంతో ఈటీవీ రంగంలోకి దిగి ఆ ఛానెల్ కి కోటి రూపాయలు కట్టమని లీగల్ నోటీసులు పంపింది.
వెంటనే ఆ కేబుల్ టీవీ ఛానెల్ సీఈవో తప్పయిందని చెబుతూ, మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చాడట. దాంతో ఈటీవీ వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఊరుకున్నారట. కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా ఒకానొక భాగస్వామిగా ఉంది.